VGన్యూస్: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆదివాసి, గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారుల అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా PMGSY గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు రాకపోకలను మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం మారుమూల గ్రామాలు, ఆదివాసి, గిరిజన గూడెలను, మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఈ పథకానికి 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదన్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తోందని.. ఆ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అటవీ, వన్యప్రాణి నిబంధనల్లో అనుకూల మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు. అటవీ సంరక్షణ చట్టాల్లో ఈ మధ్య తెచ్చిన మార్పులు ఆదివాసీల అభివృద్ధికి అటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ను రాష్ట్రం అమలు చేస్తోందన్నారు. మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ అతిథి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐడీఏ డైరెక్టర్ జనరల్, దక్షిణాది రాష్ట్రాల అధికారులు, ENC లు, CE లు పాల్గొన్నారు.










