Home తాజా వార్తలు అమ్మగా పరిపాలన అందిస్తా: కవిత

అమ్మగా పరిపాలన అందిస్తా: కవిత

VGన్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తో ప్రజలకు అమ్మనై పాలన అందిస్తానని స్పష్టం చేశారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చిందన్నారు. మలిదశలో కేసీఆర్, ఉద్యమకారులు పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు. తల్లి జేబు చూడదని, కడుపు చూస్తుందన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామని.. మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు:  తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివిన కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వమని చెప్పారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ వైద్యం చేయించుకున్న సరే ప్రజలకు ఆ వైద్యాన్ని ఉచితంగానే అందించే బాధ్యత తనదని కవిత స్పష్టం చేశారు. ఇక రైతు సంక్షేమం అంటే రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమేనన్నారు. తాము రైతులమని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, ఎరువులు సహా రైతు సంక్షేమానికి చేయాల్సివన్నీ చేస్తామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే తమ లక్ష్యమన్నారు.
ఇక ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందని కవిత చెప్పారు. యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదన్నారు. వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి వారిని ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని చెప్పారు. వారి కోసం జూన్ 2, 2014 ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇక సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు చిరు ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.

వెలుగుమట్లలో అన్ని అనుమతులు ఉన్న సరే అక్కడి ప్రజల ఇళ్లను కూల్చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. ఆ బాధతో ఒక గర్భిణీకి అబార్షన్ అయితే ఆమె తండ్రి రోదన కళ్ల ముందు ఇంకా మెదులుతుందని ఆవేదనతో చెప్పారు. రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదన్నారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే ఈ ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదన్నారు.

మారిన మర మనిషి కేసీఆర్: తన తండ్రి కేసీఆర్ మీద కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆనాటి కేసీఆర్, నేటి కేసీఆర్ వేరని చెప్పారు. ఆ నాటి కేసీఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా బయటకు రావటం లేదన్నారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ అంటూ కవిత తీవ్ర పదజాలం వాడారు. ఆర్డీఎస్ ద్వారా నీళ్ల కోసం ఆనాడు పాదయాత్ర చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయింటే పాలమూరు-రంగారెడ్డి పూర్తయ్యేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో నీళ్ల కోసం లక్షా 89 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. తాను ఎన్ని మాట్లాడిన సరే బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదన్నారు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలే బయటకు లాగి సమాధానం చెప్పేలా చేస్తారన్నారు.

బీజేపీ అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత విమర్శించారు. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారన్నారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆ గ్రామాలను తెలంగాణకు తేవాలని బీజేపీ ఎంపీలను కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సాంస్కృతిక వికాసం కోసం తెలంగాణ జాగృతి అహర్నిశలు పిడికిలి బిగించి కొట్లాడిందని కవిత గుర్తు చేశారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నేరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్ ను రాసుకోవటానికి తాను కొత్త పార్టీతో ముందుకు వచ్చానని చెప్పారు. తన జీవితంలో ఇది మరుపురాని రోజు అని కవిత పేర్కొన్నారు.