Home తాజా వార్తలు ఇందిర‌మ్మ ఇళ్ల సందేహాల నివృత్తికి కాల్‌సెంట‌ర్ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

ఇందిర‌మ్మ ఇళ్ల సందేహాల నివృత్తికి కాల్‌సెంట‌ర్ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

VGన్యూస్: హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి గందరగోళం, అపోహలు లేకుండా దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంట‌ర్ హెల్ప్‌లైన్‌ను శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మ‌ధ్యవ‌ర్తుల‌ను న‌మ్మకుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయింత్రం 6గంట‌ల‌ మ‌ధ్య ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తుదారుల సౌక‌ర్యార్ధం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాష‌ల‌లో స‌మాచారం తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రభుత్వం నుంచి సరైన సమాచారం అందించేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. తొలివిడ‌త‌లో 16 నియోజకవర్గాలలో 7680 ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్లు పేర్కొన్నారు. ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తు దారులు ఎలాంటి విష ప్రచారాల‌ను న‌మ్మకూడ‌ద‌ని మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్,వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవ‌చ్చున‌న్నారు.
నిబంధనలు:
* ద‌ర‌ఖాస్తుదారు క్యూర్ ప‌రిధిలో ప‌దేళ్లుగా నివాసం ఉండాలి.
* ద‌ర‌ఖాస్తుదారు లేదా కుటుంబానికి ఓ ఆర్ ఆర్‌, క్యూర్ ప‌రిధిలో సొంత‌ ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండ‌కూడ‌దు.
*ఒక కుటుంబానికి ఒక ద‌ర‌ఖాస్తు, ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయింపు ఉంటుంది.
* కుటుంబ వార్షిక ఆదాయం ₹6.00 లక్షల వరకు ఉండాలి.
* ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ తెలియ‌జేస్తే స‌రిపోతుంది.
* ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో 10 వేల రూపాయిల చెల్లింపున‌కు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్‌ను మాత్రమే ఉప‌యోగించాలి.
* అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించడంతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలన మరియు సమగ్ర ధృవీకరణ నిర్వహిస్తారు.
* నిర్మిస్తున్న ఫ్లాట్ల సంఖ్య కంటే అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే, పారదర్శకమైన విధానంలో లాటరీ ద్వారా ఇండ్లను కేటాయిస్తారు.
* కుల‌, జీత భ‌త్యాల ధృవీక‌ర‌ణ పత్రాల‌ను అప్ లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ు. లాట‌రీ స‌మ‌యంలో వీటిని స‌మ‌ర్పించవచ్చు.
* ఒక వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే దరఖాస్తు దారు చెల్లించిన రూ.10 వేలు తిరిగి అదే ఖాతాకు వాప‌సు అవుతుంది.
* మీసేవ ర‌శీదు, చెల్లింపు ర‌శీదు, ద‌ర‌ఖాస్తు సంఖ్య, మొబైల్‌నెంబ‌ర్‌ల‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యద‌ర్శి వి.పి.గౌత‌మ్‌, హౌసింగ్ బోర్డు సీఈ ర‌మ‌ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.