VGన్యూస్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కార్మికుల కుటుంబాలకి కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం ప్రమాద బాధిత కార్మికులు, వారి కుటంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున తక్షణ పరిహారంతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్లాంట్లో ఉద్యోగం కల్పిస్తాం. తీవ్రంగా గాయపడి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామ’ని వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 45.75 లక్షలు అందిస్తామన్నారు. క్షతగాత్రుల వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులను ప్లాంట్ యాజమాన్యమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు. ప్రమాద ఘటనపై బొకారో స్టీల్ ప్లాంట్ కు చెందిన త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక కోణంలో కాదు.. అన్ని వైపులా వివరాలు సేకరిస్తే విషయం తెలుస్తుందన్నారు. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడటం కాదు.. పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.










