Home తాజా వార్తలు ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి: సీఎం రేవంత్

ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి: సీఎం రేవంత్

VGన్యూస్: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం ఎంసీహెచ్​ఆర్​డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులను ఆదేశించారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని చెప్పారు. తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, సంబంధిత విభాగాలకు పంపించాలన్నారు. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని స్పష్టంచేశారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలన్నారు.