VGన్యూస్: 22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/A జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.







