VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే మైనార్టీ డిగ్రీ కళాశాలలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యంత్రి సూచించారు. సంప్రదాయ కోర్సులకు పరిమితం కాకుండా వారి జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణను ఇవ్వాలన్నారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లే మైనార్టీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 కి ఎంపికైన మైనార్టీ అభ్యర్థులలో ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి మైనార్టీ సంక్షేమ శాఖలో బాధ్యతలు అప్పగించి.. ఆ శాఖ పరిధిలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగేలా వారిని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమానికి గ్రూప్స్‌కు ఎంపికైన వారిని, క్రీడాకారులను ఆహ్వానించి విద్యా, క్రీడల ప్రాధాన్యతను వారికి తెలియజేయాలని సూచించారు. ఇమామ్, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ పారితోషికాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్జీబ్ ను తెలియజేసేలా ఆ కట్టడాలు ఉండాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,TGMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీతో పాటు వివిధ సంస్థలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







