Home తాజా వార్తలు తెలంగాణ నేడు రైతన్నల కన్నీళ్లతో తల్లడిల్లుతున్నది: కేటీఆర్

తెలంగాణ నేడు రైతన్నల కన్నీళ్లతో తల్లడిల్లుతున్నది: కేటీఆర్

VGన్యూస్: రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉన్నదని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంట కొనుగోళ్లు గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లు దేశానికి అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు రైతన్నల కన్నీళ్ళతో తల్లడిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన పంట కొనుగోళ్ల పైన, పంటల వారీగా లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న రైతన్నల దుస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వానికి నిన్న ఒక బహిరంగ లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్ ముచ్చట్లు చెప్పారని మండిపడ్డారు.

అన్నదాతలు పంటను కొనుగోలు కేంద్రాలకి తరలిస్తే.. కనీసం వాటిని కాంటా పెట్టడం లేదన్నారు. కాంటా పెట్టిన సందర్భంలోనూ భారీగా తరుగు తీసి దోపిడీకి గురి చేస్తున్నదని మండిపడ్డారు. గన్నీ బ్యాగుల నుంచి మొదలుకొని సుతలి దారం వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నదాతల ఆత్మహత్యలపైన, మరణాలపైన ప్రభుత్వానికి సమాచారం ఇస్తే.. సివిల్ సప్లై మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఎవరూ చనిపోలేదని బుకాయిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా రోడ్లెక్కి ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నాము కాబట్టి ఎవరు చెప్పినా వినము అనే మూర్ఖత్వంతో వ్యవహరించవద్దని సర్కారుకు సూచించారు.

కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత యూరియా దొరకదు, రైతుబంధు దొరకదు, రుణమాఫీ దొరకదు.. చివరికి పండించిన పంట అమ్ముకుందామంటే కూడా సౌకర్యాలు దొరకవన్న పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. పంతాలకు పోకుండా రైతన్నల కోసం అండగా నిలబడాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. కనీసం రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ల సంక్షోభంపైన చర్చించాలని.. రైతన్నల కష్టాలే ఏకైక ఎజెండాగా సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పంట కొనుగోళ్లపై తగిన చర్యలు తీసుకోకుంటే.. పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ హెచ్చరించారు.