VGన్యూస్: తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) త్రైమాసిక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. దాదాపు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీని ఒకే దశలో అమలు చేసి దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. రైతులు రుణాల చెల్లింపులో క్రమశిక్షణ పాటిస్తున్నందున బ్యాంకులు పెట్టుబడి రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు.
కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, TGCAB వంటి బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాల పంపిణీ చేయగా, మరికొన్ని బ్యాంకులు తమ పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఇప్పటికీ వ్యవసాయ రుణాలలో అధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే పరిమితమవడం ఆందోళన కలిగించే విషయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షిత సాగు, పాడి, మత్స్య, యాంత్రీకరణ వంటి రంగాల వైపు వేగంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించాలని కోరారు. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. వీటికి బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బలమైన ఆర్థిక మద్దతు అవసరమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కౌలు రైతులు.. సాగుభూమిలో దాదాపు 30 శాతం భాగాన్ని సాగు చేస్తున్నారన్నారు. వారికి సకాలంలో పంట రుణాలు అందించడం అత్యంత అవసరమని మంత్రి తెలిపారు. గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను జాతీయ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.







