Home తాజా వార్తలు 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్వవ‌స్థే ల‌క్ష్యం: డిప్యూటీ సీఎం

3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్వవ‌స్థే ల‌క్ష్యం: డిప్యూటీ సీఎం

VGన్యూస్: సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం, మ‌హిళా సాధికార‌త‌, మూసీ పున‌రుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథ‌మ ప్రాధాన్యత‌ల‌ను ఇస్తోంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం మ‌హాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభ‌వ‌న్ లో జ‌రిగిన 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్యవ‌స్థగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృత‌నిశ్చయంతో ప‌నిచేస్తోంద‌ని స్పష్టంగా చెప్పారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని అన్నారు. రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు మరియు అనుబంధ రంగాలకు కిసాన్ క్రెడిట్ కార్డు సహా వివిధ పథకాల ద్వారా బ్యాంకులు అందిస్తున్న మద్దతు అభినంద‌నీయమని పేర్కొ న్నారు.

మ‌హిళా ఆర్థిక సాధికార‌త కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు రూ. 5 ల‌క్షల నుంచి రూ. 10 ల‌క్షల‌కు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యార్థుల‌కు ఇచ్చే రుణాల విష‌యంలో బ్యాంకులు మ‌రింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాల‌ని సూచించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగ‌వంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒక‌టని చెప్పారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకులు సూక్ష్మ, చిన్నత‌ర‌హా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని అన్నారు. బ్యాంకులు కేవలం డబ్బు డిపాజిట్ చేసే, రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలుగానే కాకుండా.. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి భాగస్వాములుగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.