VGన్యూస్: తెలంగాణ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. శనివారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఏఐ కాప్‌రైటర్ యాప్ ను ఆవిష్కరించారు. అనంతరం దాని పనితీరును పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని సీపీ సజ్జనార్ అన్నారు. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం అన్నారు. మెుదటగా హైదరాబాద్ నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులు తన మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్ దానిని వెంటనే గుర్తించి, అనువదించి, అధికారిక రికార్డుగా మారుస్తుందన్నారు. దీని ద్వారా దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుందని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యమని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, అదనపు సీపీ(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ (ఎస్ఎమ్ఐటీ) సీహెచ్ రూపేష్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేశ్, బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







