Home తాజా వార్తలు వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి

వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి

VGన్యూస్: తెలంగాణలో వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవత్ర అధికంగా ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జిల్లాల క‌లెక్టర్ల నివేదిక ప్రకారం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో న‌లుగురు, వ‌రంగ‌ల్ అర్బన్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గ‌ద్వాల్‌, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున మెుత్తం ఏడు జిల్లాల్లో 16 మంది వ‌డ‌దెబ్బతో మృతి చెందార‌న్నారు. జిల్లా కలెక్టర్లు హీట్ వేవ్ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు.