Home తాజా వార్తలు తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్

తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్

VGన్యూస్: తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను మంళవారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను (Kazipet Railway Division) ఏర్పాటు చేయాలని ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు, మోతమర్రి-విష్ణుపురం, కాజీపేట-వంగపల్లి రైల్వే సెక్షన్లను చేర్చాలని సూచించినట్లు చెప్పారు. అలాగే మనోహరాబాద్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కొత్తపల్లి రైల్వే లైన్‌ను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో చేర్చి ఆధునీకరించాలని, మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జికి ఆమోదం తెలపాలని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తాన్ని విద్యుదీకరించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలోని టైర్-2 ఐటీ (IT) నగరాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ తెలిపారు.