VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన 17 ఏళ్ల యువ అభిమాని నిరంజన్ కోరికను తీర్చారు పవన్ కళ్యాణ్. హనుమకొండ పట్టణంలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు.
నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని.. భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు పవన్ కళ్యాణ్. వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. అలాగే వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ నాయకులకి దిశానిర్దేశం చేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి వెండి ప్రతిమకు పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానన్నారు.







