VGన్యూస్: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1,00,000 ఏకమొత్తo ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, అలాగే కుటుంబంలోని గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 159 మందికి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అనంతరం తమ మధ్య నేడు లేని పాత్రికేయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, జర్నలిస్టులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.







