Home రాజకీయం తెలంగాణ గాంధీ భూపతిని గౌరవించాలి

తెలంగాణ గాంధీ భూపతిని గౌరవించాలి

చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థ సేవ, ఉద్యమ భావాలు కలిగిన మహానియుడు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసిన పోరాటయోధుడు. తన ఆస్తులను ఉద్యమాలకే దారపోసిన ధీరోదాత్తుడు. ఆయన జీవితం అంతా పోరాటమే… బతుకంతా ఉద్యమాలే. నిస్వార్థంగా పోరాడటమే తప్ప పేరుప్రఖ్యాతలు, పదవులు ఆశించని మహా మనిషి… మనమందరం తెలంగాణ గాంధీగా పిలుచుకునే గొప్ప పోరాటశీలి భూపతి కృష్ణమూర్తి.
గాంధేయవాది:
కరీంనగర్‌ జిల్లా ముల్కనూర్‌కు చెందిన భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న వరంగల్ లోని తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. 1941 నుంచి 1946 వరకు వరంగల్ పట్టణ కాంగ్రెస్‌పార్టీ కోశాధికారిగా పనిచేశారు భూపతి కృష్ణమూర్తి. కాంగ్రెస్‌సిద్ధాంతాలను పల్లెపల్లెన ప్రచారం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వ్యాపారం చేస్తున్న తరుణంలోనే యువకులలో క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో 1943లో నేషనల్‌క్లబ్‌ను స్థాపించి ఆటలను ప్రోత్సహించారు. హాకీ, వాలీబాల్,కబడ్డీ, స్విమ్మింగ్, వెయిట్ లిప్టింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం కలిగినవారు భూపతి. అంతే కాదు అర్జున అవార్డు గ్రహీత జె.పిచ్చయ్యతో కలిసి బాల్ బ్యాడ్మింటన్ ఆడేవారు. 1944లో మహాత్మా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్‌2న వార్దాకు వెళ్లి గాంధీతో పాటు పదిరోజులు అక్కడే గడిపే అరుదైన అవకాశం పొందారు భూపతి కృష్ణమూర్తి.
అవిశ్రాంత పోరాటం:
1952లో భూపతి కృష్ణమూర్తి ప్రారంభించిన ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని వయోభారం సమస్య ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కొనసాగించారు. 1946 ఆగస్టు 11న హయగ్రీవాచారితో కలిసి ఓరుగల్లు కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదే సమయంలో రజాకార్ల దాష్టీకాన్ని కూడా ఆయన చవి చూశారు. 1946లో ఖాదీ బోర్డు ప్రచార కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947-48 మధ్యకాలంలో జరిగిన హైదరాబాద్ విమోచన పోరాటంలో చురుకుగా పాల్గొని అజ్ఞాత జీవితం గడిపారు. అలాగే 1948లో జరిగిన గ్రంథాలయోద్యమంలో సైతం పాల్గొన్నారు తెలంగాణ గాంధీ. ఇడ్లీ సాంబార్ వ్యతిరేక ఉద్యమంలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు. 1953-54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ ను బలంగా వినిపించారు. తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లో వేరే ప్రాంతంతో కలపొద్దని అవిశ్రాంతంగా పోరాటం చేశారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ:
1967లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు భూపతి కృష్ణమూర్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదేమోనని నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో యువకులు, మేధావి వర్గాలతో కలిసి తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటుతో మరోసారి తెలంగాణ వాదులలో ఆశను రేకెత్తించారు. 1972లో తెలంగాణ ప్రజాసమితి, 1978లో జనతా పార్టీ, 1983లో బీజేపీ, 1985లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వరంగల్ శాసనసభ (పస్తుత వరంగల్ తూర్పు) స్థానానికి పోటి చేసి ఓడిపోయారు భూపతి. 1972లో పి.వి నర్సింహారావు, 1983లో ఎన్టీ రామారావు పిలిచి ఓరుగల్లు అసెంబ్లీ టికెట్ ఇస్తానంటే కూడా తెలంగాణ గాంధీ తిరస్కరించారు. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష ఆయనలో ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. 1970-74లో దక్షిణ మద్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. 1982 జనవరి 19న కార్మిక సంఘాల జాతీయ సమన్వయ సంఘం పిలుపు మేరకు నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై వారం రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు భూపతి కృష్ణమూర్తి.
విద్యా, వైద్య సేవలో:
ఓరుగల్లులో నెహ్రూ మెమోరియల్ హైస్కూల్, సి.కె.ఎం కాలేజీ ఏర్పాటుకు కూడా కృషి చేశారు భూపతి కృష్ణమూర్తి. అలాగే విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల పాలకవర్గ సభ్యుడిగా,ఉపాధ్యక్షుడిగా, 1982 నుంచి1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడిగా పనిచేశారు. సి.కె.ఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సలహా మండలి సభ్యుడిగా ప్రభుత్వంచే నామినేట్ చేయబడినారు.
సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలగాలనే ఆలోచనతో ముల్కనూరు కో-ఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. ఈ సొసైటీకి భూపతి కృష్ణమూర్తి వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సొసైటీ ఆసియా ఖండంలోనే ఆదర్శంగా నిలిచింది. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా వ్యవహరించారు. అలాగే వరంగల్ వ్యవసాయ గ్రేన్ మార్కెట్ సభ్యునిగా, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్తి వింగ్ కు అధ్యక్షునిగా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీగా తెలంగాణ గాంధీ పనిచేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆయనకు తెలంగాణ సమాజం 2009లో తెలంగాణ గాంధీ అని బిరుదునిచ్చి సత్కరించింది. ప్రజాబంధు, స్వతంత్ర సమరకేసరి అవార్డులను అందుకోన్నారు భూపతి కృష్ణమూర్తి. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తూ నడిచిన భూపతి కృష్ణమూర్తి తాను కోరుకున్నట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే 2015 ఫిబ్రవరి 15న వరంగల్‌లో తుది శ్వాస విడిచారు.

ఇంతటి గొప్ప ఘన చరిత్ర కలిగిన మహానియుని పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీలలో ఏదైన ఒక యూనివర్సిటీకి లేదా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయానికి భూపతి కృష్ణమూర్తి గారి పేరు పెట్టి ఈ పోరాటయోధుడిని గౌరవించాలి. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కారు 9 మంది కవులు, కళాకారులు,రచయితలు, ఉద్యమకారులను గుర్తించిన విధంగానే భూపతి కృష్ణమూర్తి గారిని గుర్తించి సత్కరించాలి. అదే విధంగా భూపతి కృష్ణమూర్తి గారి జయంతి , వర్థంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి తెలంగాణ గాంధీని గౌరవించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here