VGన్యూస్: మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన (తక్షణ రక్షణ) వాహనాలకు సీఎం జెండా ఊపి ప్రారంభించారు. నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో స్పందన టీమ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలంటే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రత ఉండాలి. మహిళ చదువు, వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించినప్పుడే సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలను పూర్తిగా నిరోధించి వారికి తగిన రక్షణ కల్పించే విషయంలో స్వచ్ఛంధ సంస్థలు, పీస్ కమిటీలు కూడా సామాజిక బాధ్యతగా పనిచేయాలని కోరారు.
మహిళల పట్ల దురుసుగా, అవహేళనగా ప్రవర్తించిన వారిని శిక్షించడానికి షీ టీమ్స్ ఏర్పాటు చేయగా, సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళకు అండగా నిలవాలన్న లక్ష్యంతో Stand With Her అనే కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పనిచేసే స్పందన టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీమ్లు బాధితుల వద్దకు వెళ్లి ముందు వారికొక మానసిక ధైర్యాన్ని కల్పిస్తాయని చెప్పారు. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాయన్నారు. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కన్నా సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజంపైన కూడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ , డీజీపీ శివధర్ రెడ్డి , హైదరాబాద్ సీపీ సజ్జనార్ , ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ పీస్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.







