Home తాజా వార్తలు శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై సీఎం సమీక్ష

శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై సీఎం సమీక్ష

VGన్యూస్: పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

శాసనసభ ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు ప్రైవసీ ఉండాలని చెప్పారు. గతంలో నిర్ణయించిన మేరకు పార్లమెంట్ తరహాలో సభ్యులకు సెంట్రల్ హాలును వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలో భద్రతను కూడా మరింత పటిష్టం చేయాలని పలు సూచనలు చేశారు. సభ్యుల కోసం ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.