VGన్యూస్: పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు కమిటీ (Assurance Committee), శాసనసభ యొక్క నియమాల కమిటీ (Rules Committee), శాసనసభ యొక్క నైతిక విలువల కమిటీల (ethics Committee) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విదంగా చూడాల్సిన బాధ్యత హామీల కమిటీది అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల నమ్మకాన్ని బలోపేతం చేయడం అనే ఉద్యేశ్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటరీ వ్యవస్థలో నైతిక విలువల కమిటీ అనే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా కమిటీలు పనిచేయాలని సూచించారు.
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శాసనసభలో సభ్యులకు మొదటిగా ఇచ్చేది రూల్స్ బుక్, దానికి అనుగుణంగా స్పీకర్ శాసనసభను నడుపుతారని తెలిపారు. సభలో నియమాలను పాటించే విదంగా చూడడంతో పాటుగా, సభ హుందాతనాన్ని కాపాడడంలో విలువల కమిటీది కీలక పాత్ర అని అన్నారు. కమిటీ నిర్ణయాలు పారదర్శకంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉండే విదంగా ఎథిక్స్ కమిటీ సూచనలు ఉండాలన్నారు. శాసనసభ కమిటీలు ఇతర రాష్ట్రాలలో కూడా స్టడీ టూర్ చేసి ఆయా రాష్ట్రాల శాసనసభలలో అమలవుతున్న నిబంధనలను పరిశీలించాలి, వారి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ హామీల అమలు కమిటీ ఛైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు జె. అనిరుధ్ రెడ్డి, జారే ఆదినారాయణ,శాసనసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి, సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, రూల్స్ కమిటీ సభ్యులు దానం నాగేందర్, తూడి మెఘారెడ్డి, భూక్యా మురళి నాయక్, కౌన్సిల్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.










