VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అత్యంత దారుణంగా హత్యకు గురైన వార్త రావడం దిగ్భ్రాంతి కరమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న రాత్రి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు.
నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేలా వ్యవహరించాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.







