VGన్యూస్: ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎమ్మెల్సీ పదవి ఉపయుక్తంగా ఉంటుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జయశంకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతానని తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆచార్య కోదండరాం మాట్లాడుతూ.. పదవులు అనేవి శాశ్వతం కావని అన్నారు. ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు, నేను పోరాడి చూపిస్తా అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు.
వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానన్నారు. స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. గతంలో ఉన్న జీవనశైలిని భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తానన్నారు. ప్రజల కోసం ఎప్పుడూ నిలబడతానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం హామీ ఇచ్చారు.







