Home తాజా వార్తలు టీవీ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి

టీవీ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి

VGన్యూస్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల రూపకల్పన, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డుల (TGSTA) కమిటీతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెలివిజన్ రంగం అత్యధిక వినోదాన్ని అందించే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాల పట్ల విశేష ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న ఈ టెలివిజన్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అవార్డు గ్రహీతల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని కమిటీ ఛైర్మన్, సభ్యులకు మంత్రి సూచించారు.
నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో పాటు న్యూస్ ఛానెల్స్ యాంకర్లు, ప్రజెంటర్లకు కూడా ఈ పురస్కారాల్లో ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీ సభ్యులు సూచించిన విధంగా టెలివిజన్ అవార్డులకు మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని సీఎంతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద రెడ్డి, టెలివిజన్ అవార్డుల కమిటీ ఛైర్మన్, సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.