Home తాజా వార్తలు కొడంగల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్

కొడంగల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్

VGన్యూస్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్ లో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.
అలాగే కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో తలపెట్టిన పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుందామని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో 225 ఎకరాల్లో ఒక ఎడ్యుకేషనల్ హబ్ తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.

మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నది జలాలతో ఈ ప్రాంత భూములు తడవాలన్నారు. రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ను లగచర్ల దగ్గర కట్టుకుంటున్నాం. కోస్గీ నుండి నేరుగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు 300 అడుగుల రోడ్డు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు,తదితరులు పాల్గొన్నారు.