Home తాజా వార్తలు విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం

VGన్యూస్: మధిరలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ (Centralized Community Kitchen)ను ప్రారంభించడం ఎంతో సంతృప్తినిచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేయడం తన రాజకీయ జీవితంలో మరపురాని అనుభూతి అని పేర్కొన్నారు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ (Hare Krishna Charitable Foundation) భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం అభినందనీయమైన కార్యక్రమం అన్నారు.
ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదన్నదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన ఉచిత పోషకాహార అల్పాహార పథకం ఉచితం కాదు.. భావితరాలపై ప్రజా ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడి అన్నారు. మానవ వనరులే రాష్ట్ర సంపద.. సానబెట్టిన వజ్రాల్లా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్ది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పాలన అంటే పెత్తనం కాదు.. సమాజ హితం కోసం వనరులను వినియోగించి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమని చెప్పారు.
ప్రజల మధ్య ఆనాడు చేసిన ‘పీపుల్స్ మార్చ్’లో చూసిన కష్టాలే నేడు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలుగా రూపుదిద్దుకుంటున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. మధిర తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అత్యాధునిక ‘మెకనైజ్డ్ సెంట్రలైజ్డ్ కిచెన్స్’ (Mechanized Kitchens) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మీ తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో, ప్రేమతో మీ భవిష్యత్తు కోసం కలలు కంటున్నారో.. ఈ ప్రభుత్వం కూడా మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని అంతే ఆప్యాయంగా కోరుకుంటోందన్నారు. నాణ్యమైన భోజనం, ఉన్నత విద్యను అందించి మిమ్మల్ని ఉన్నత స్థానాల్లో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.