VGన్యూస్: దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతానికి తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు అందించిన సేవలు ప్రశంసనీయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు, తొలిసారిగా బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు న్యూఢిల్లీలో నిర్వహించిన సన్మాన(Felicitation) కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో కేటీఆర్, ఉదయ్ నాగరాజును శాలువాతో ఘనంగా సత్కరించడంతో పాటు, ప్రత్యేక కరీంనగర్ ఫిలిగ్రీ మెమెంటోను అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. యూకే పౌరుడిగా అక్కడి స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా (UK MP) ఎన్నిక కావడం ఉదయ్ నాగరాజు పట్టుదల, కృషి, ప్రజాసేవకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు, ముఖ్యంగా ప్రవాస భారతీయులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో భారత్–యూకే సంబంధాల మరింత బలోపేతంతో పాటు, తెలంగాణకు సంబంధించిన వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సేవారంగాల్లో కూడా ఉదయ్ నాగరాజు కీలక పాత్ర పోషించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆ దిశగా కలిసి పనిచేద్దామని సూచించారు.
అనంతరం ఉదయ్ నాగరాజు(Uday NagaRaju) మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నాయకత్వంలో సాగిన రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేసుకున్నారు. అనంతరం అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, అత్యుత్తమ ఉద్యోగాన్ని వదులుకుని స్వరాష్ట్రం, ప్రజల కోసం భారత్‌కు తిరిగి వచ్చి, సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ ప్రస్థానం తనను ఎంతో ప్రభావితం చేసిందని అన్నారు. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తే సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరనే విశ్వాసాన్ని కేటీఆర్ తన రాజకీయ ప్రయాణంతో కల్పించారని ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. యూకేకు కేటీఆర్ వచ్చిన ప్రతిసారీ ఆయనతో కలిసి సమావేశమై వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకునే అవకాశం లభించిందన్నారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సమకాలీన రాజకీయాలపై కేటీఆర్‌కు ఉన్న దూరదృష్టి తనకు స్ఫూర్తి ఇచ్చిందని ఉదయ్ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.










