Home తాజా వార్తలు కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

VG న్యూస్: లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎన్డీఎస్ఏ చైర్మన్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జరుగుతున్న పరీక్షలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మత్తులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సంబంధిత అన్ని సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అందరినీ కలుపుకుని పర్యటనకు వచ్చామన్నారు. అలాగే తుమ్మడిహెట్టి వద్ద ఆపేసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీటిని తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.