VGన్యూస్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో గిరినగర్ డివిజన్ లోని శ్రీసాయి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ.. జనాభా అనేది లెక్క కాదు.. అది ఆ దేశ భవిష్యత్తు అని అన్నారు. మానవ వనరులను నైపుణ్య వనరులుగా మార్చుకుంటే జనం, దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో జనాభా విస్ఫోటనం ప్రధాన సమస్యగా భావించబడింది.. అయితే ఇప్పుడు అనేక దేశాల్లో తక్కువ జననాల రేటు, వృద్ధుల జనాభా పెరుగుదల, కార్మికుల కొరత వంటి కొత్త సవాళ్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఒకవైపు కొన్ని దేశాలు జననాలను ప్రోత్సహించే విధానాలు చేపడుతుండగా, మరోవైపు కొన్ని దేశాలు తమ జనాభా నిర్మాణాన్ని సమతుల్యం చేయడానికి కృషి చేస్తున్నాయని మధుబాబు పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో ఒకటి.. భారత్ కు ఉన్న యువశక్తిని నైపుణ్యంగా, ఆరోగ్యంగా, ఉత్పాదకంగా తీర్చిదిద్దితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే విధానంతో ప్రజలు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ వ్యవస్థాపకులు తూటే విజయ్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ కట్టె, సందీప్ బల్లెం, చైతన్య బల్లెం, ఆనంద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.







