Home ఆధ్యాత్మికం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ

VGన్యూస్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ అమ్మవారు బల్కంపేటలో కొలువై వుండటం తెలంగాణ రాష్ట్రానికి మంగళప్రదం అని మంత్రి అన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవ సమన్వయ సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ అమ్మవారి దర్శనం చేసుకుని, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పై వివిధ శాఖలకు అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. బల్కంపేట దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోలు ఉత్సవంతో వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయని, 21వ తేదీన ఉదయం 9 గంటలకు అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారని, 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, అడిషనల్ సీపీ ఇక్బాల్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఆర్&బీ, దేవాదాయ, టీజీఎస్పీడీసీఎల్, జిహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖ తదితర శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.