VGన్యూస్: భారత్లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. కెనడా- తెలంగాణ మధ్య వేగంగా విస్తరిస్తున్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక రంగాల్లో పరస్పర సహకరించుకునే అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు ఆహ్వానించారు. ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా రంగాల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం కోసం కెనడాలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ వంటి మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి అంశాలను ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుల్లో కెనడా సాంకేతిక నైపుణ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యానికి విశేష అవకాశాలు ఉన్నాయని హై కమిషనర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కెనడియన్ సంస్థలకు పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా, ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, సీఐబీసీ (CIBC) తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించడం, అలాగే CPP Investments హైదరాబాద్కు చెందిన CtrlS Datacenters తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉండడం వంటి పరిణామాలను కూటర్ ప్రస్తావించారు.
రాష్ట్రంలో హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లక్ష్యాల సాధనలో కెనడా సహకారాన్ని సీఎం కోరారు. అలాగే కెనడాకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు కలిసి హైదరాబాద్లో ఒక మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూటర్ హామీ ఇచ్చారు. రానున్న నెలల్లో కెనడియన్ వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణను సందర్శించి ఇంధనం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, ఐటీఈ&సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.







