VGన్యూస్: రాబోయే జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భాజపా బూత్ అధ్యక్షులు, బీఎల్ఏల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. కార్యకర్తల సత్తా ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి వచ్చినా సరే హైదరాబాద్ ఎప్పటికీ బీజేపీ అడ్డానే అని నిరూపించబోతున్నమన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు రాంచందర్ రావు. ఒక్క రోజు వాన పడితే చాలు రోడ్లు నదులుగా మారుతున్నాయి.. వాహనాలు మునిగిపోతున్నాయి, కరెంట్ షాక్‌లతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థితి మారాలంటే వీరికి గుణపాఠం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలిచింది ప్రజల మద్దతుతోనే కానీ ఎస్ఐఆర్ తో కాదని స్పష్టం చేశారు. రేపు తెలంగాణలో కూడా ప్రజల ఆశీస్సులతోనే బీజేపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అధికారం ముఖ్యమైతే.. తమకు దేశ సేవ, ప్రజా సేవ ముఖ్యమని తెలిపారు.







