Home తాజా వార్తలు కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు అప్పగిస్తే రాష్ట్రం అంతటికీ నీళ్లు: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు అప్పగిస్తే రాష్ట్రం అంతటికీ నీళ్లు: కేటీఆర్

VGన్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కి వారం రోజులు అప్పగిస్తే తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన కోసం వెళ్లింది. ఈ సందర్భంగా కన్నెపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి కన్నెపల్లికి చేరుకునేందుకు 4 గంటలు పడుతుంది.. కానీ కాంగ్రెస్ సర్కార్ పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్‌, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్‌లో అడుగడుగునా తమను అడ్డుకున్న వాటన్నింటినీ అధిగమించి కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకున్నామన్నారు. తాము ఇక్కడికి రాజకీయ కక్ష తీర్చుకునేందుకు రాలేదన్నారు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి.. కానీ నేడు 98 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీతో అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తరలించవచ్చు. పంపులు ఆన్‌ చేయమని రైతులు ఆందోళనలు చేసినా.. మిడ్‌ మానేరు నింపాలని మా నాయకులు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ కోరినా ఫలితం లేకుండాపోయింది. నీళ్ల లభ్యత ఎక్కడా లేకపోతే.. కన్నెపల్లి నీళ్లను ఎత్తిపోయవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్పీలోనూ నీళ్లు లేకుంటే రివర్స్‌ పంపింగ్‌లో నీళ్లు నింపుకోవచ్చని కేటీఆర్ అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయలేదన్నారు కేటీఆర్. మేడిగడ్డ పిల్లర్ల బ్లాక్‌ను నిర్మించేందుకు రూ.400 కోట్లు అవుతాయి. ప్రజలపై పైసా భారం పడకుండా.. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ముందుకు వచ్చినా ఇంతవరకూ మరమ్మతు చేయలేకపోయారని మండిపడ్డారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినో వస్తుందని మూడు నెలల క్రితమే అధికారులు చెప్పారు. 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాళేశ్వరంతో హైదరాబాద్‌ తాగునీటితో సహా ఉమ్మడి 7 జిల్లాలకు నీళ్లివ్వవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో పడావు పెడితే.. సాగునీళ్లే కాదు.. హైదరాబాద్‌ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, మోటార్లు ఆన్ చేసి, నీళ్లను ఎత్తిపోయకపోతే.. 50 వేల మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్‌ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, జీవన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, నోముల భగత్, చిరుముర్తి లింగయ్య, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, వొడితల సతీష్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.