VGన్యూస్: మిడ్జిల్‌ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం మాట్లాడుతూ.. మిడ్జిల్ మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి. అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మండలాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కోరారు. ఇక్కడ ప్రజలు నాకు సర్వం ఇచ్చారు. నన్ను పెంచి పోషించారు. ఆనాడు మొక్కనాటిన మిడ్జిల్ మండలాన్ని అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాపై ఉంది. కరవుతో అల్లాడుతున్న డార్క్ ఏరియా కాదు. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి అని సీఎం రేవంత్ రెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
గడిచిన 20 ఏళ్లలో ఏనాడూ సెలవు తీసుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని, అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశా అని ముఖ్యమంత్రి చెప్పారు.
జులై 4, 2006 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మీద మిడ్జిల్ ప్రజలు ఒక చరిత్రను లిఖించిన రోజు అని సీఎం అన్నారు. జెడ్పీటీసీగా గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. నిజాం సర్కార్ నుండి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పని చేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అత్యంత వెనుకబడిన ఈ మండల ప్రజలు 2006లో తీసుకున్న నిర్ణయంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత తన మీద ఉంది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వలసల పాలమూరును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Home తాజా వార్తలు మిడ్జిల్ డార్క్ ఏరియా కాదు.. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి: సీఎం







