తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు లేఖ రాస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు అని సీఎం అన్నారు. దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో విశ్వవిద్యాలయాలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. అందుకోసమే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం అని సీఎం పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నాం. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలాగే తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.