VGన్యూస్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ప్రకటించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం – మహిళా సంఘాల యాజమాన్యం ద్వారా 553 బస్సుల నిర్వహణను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమంలో బస్సులకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం 67 లక్షల మంది సభ్యులున్నారు. కోటి మందిని సభ్యులుగా చేర్పించండి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదంటూ మహిళల సంక్షేమానికి తీసుకున్న కార్యక్రమాలను సమగ్రంగా వివరించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణంగా సహకరిస్తా. మహిళల పర్యవేక్షణ ఉంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయని చాలా విషయాల్లో నిర్వహణ బాధ్యతను వారికే అప్పగిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నాం. పంట మార్పిడిపై రైతులు, రైతు సమాఖ్యలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల్లో చదువుకున్న అవగాహన కలిగిన మహిళలు రైతుల్లో చైతన్యం కల్పించాలని సీఎం కోరారు.
మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా స్వయం సహాయక సమాఖ్య, మండల మహిళా సమాఖ్యలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సులపై అద్దె రూపేణా రూ. 20.34 కోట్ల చెక్కు, ఉచిత ప్రయాణం కింద ఆదా చేసిన రూ. 10,700 కోట్లు, వడ్డీ లేని రుణ పథకం కింద రూ. 500 కోట్ల చెక్కులను సీఎం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.







