తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..?
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ సర్కారు తీరును తప్పుబట్టారు. ఈ సమయంలో అధికార పక్ష కాంగ్రెస్, భారాస సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ కల్పించుకొని సభా సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించాలని భారాస సభ్యుడు జగదీష్ రెడ్డికి సూచించారు. తాను ఎలాంటి సభా సంప్రదాయాలను ఉల్లఘించానో చెప్పాలని స్పీకర్ ను జగదీష్ రెడ్డి కోరారు. ఈ సభ అందరిదీ.. ప్రతి ఒక్క సభ్యునికి సమాన అవకాశాలు ఉంటాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మా అందరీ తరఫున పెద్ద మనిషిగా మీరు స్పీకర్ కూర్చీలో కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి చేసిన ఈ వాఖ్యలు సభా సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని స్పీకర్ ఆక్షేపించారు.