Home తాజా వార్తలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

VGన్యూస్: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చగల రంగాలపై పూర్తి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే క్రమంలో పీపీపీ మోడల్ ద్వారా పర్యాటక ఆస్తుల అభివృద్ధి, టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంతో పాటు వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో నూతన ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. దీనితో పాటు పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతి సాధ్యాసాధ్యాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా మెరుగుపడుతున్న ఆదాయం, రవాణా శాఖలో బీహెచ్ సిరీస్ పన్నుల విధానంపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులతో చర్చలు, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ తదితర మార్గాల ద్వారా అభివృద్ధికి అవసరమైన వనరుల సమీకరణపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.