VGన్యూస్: భూ సమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం నాడు రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలుండగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని.. అది అతని జీవనాధారమన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ రీ-సర్వే కార్యక్రమం చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భూ భారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో రీ-సర్వే ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.







