Home తెలంగాణ రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : శ్రీధర్ రెడ్డి

రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : శ్రీధర్ రెడ్డి

VGన్యూస్: కోదాడ మండలంలోని అల్వాలపురం, గుడిబండ గ్రామాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళాలను ఏర్పాటు చేశారు. ఈ విత్తన మేళాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాణ్యమైన, ప్రభుత్వం సూచించిన సన్న వరి రకాల విత్తనాలను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఆరుతడి పంటలైన పెసర, కంది, కూరగాయ పంటలు సాగు చేయాలని సూచించారు. కోదాడలోని ఎరువుల దుకాణాలలో నిల్వలను పరిశీలించారు. యూరియా యాప్ ద్వారానే ఎరువులను కొనుగోలు చేయాలన్నారు. ఎమ్మార్పీ రేట్లకే ఎరువులను విక్రయించాలని.. అధిక ధరలకు అమ్మినట్లయితే డీలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ సంచాలకులు పి. ప్రశాంతి, రజిని, నగేష్, రైతులు, డీలర్స్ పాల్గొన్నారు.