VGన్యూస్: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకట్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు స్కీమును ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే నేరుగా నడిపించాలన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కోదాడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ సంతోష్ కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఉపయోగము లేని సీఎస్సీ హెల్త్ టెస్టుల పేరుతో లక్షల రూపాయలు వృధా చేస్తుందని వెంటనే వాటిని రద్దు చేయాలన్నారు. కార్మికులు చనిపోతే సహజ మరణానికి రూ. 5 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు పైబడిన కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. లేబర్ కార్యాలయంలో కొన్ని నెలల తరబడి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ కి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. అర్హులైన ఇల్లు లేని భవనిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు దశలవారీగా కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం. ముత్యాలు, యూనియన్ అధ్యక్షులు పంది కృష్ణ, చంద్రయ్య, నాగయ్య, శీను, సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.










