VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భారాస అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినంక రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు కుప్పకూలి పోయినవని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇంటికే నీళ్ల ట్యాంకర్ తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలకు ఉన్న అవస్థలపై కేసీఆర్ సూచనల మేరకు జిల్లాల వారీగా మా నాయకులందరూ సమన్వయం చేసుకొని పోరాడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాగైతే ఆంక్షలు లేకుండా అన్ని పంటలను కొనుగోలు చేశామో.. అలాగే కాంగ్రెస్ సర్కార్ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కాను డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఊరూరా ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశామన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుండి అన్ని స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలు వేస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఈసారి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో చేపట్టబోయే ఎస్ఐఆర్‌పై బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ, వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీవ్రంగా ఖండించిందని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా.. ఉత్సవ విగ్రహాల్లా కూర్చుని చూశారు తప్ప, ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటుని తెలంగాణ ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు.







