VGన్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ చేశారు. అలాగే టెంపుల్ సిటీ పరిధిలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రూ.43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










