Home తాజా వార్తలు ఐఎండీ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి

ఐఎండీ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి

VGన్యూస్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు, వ‌డ‌గాల్పుల ప్రభావం మ‌రింత పెర‌గ‌నుంద‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. ఐఎండీ హెచ్చరిక‌ల సందర్భంగా.. శ‌నివారం మంత్రి సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించారు. ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, రోడ్లపై పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. జీవరాశుల సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతేనని.. గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా పక్షులు, జంతువులకు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.