VGన్యూస్: తమ స్వేదాన్ని చిందిస్తూ.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భంలోని బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి నిధి పేరుతో సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల్లో వాటాను తగ్గిస్తూ మోసం చేస్తున్నదన్నారు. కార్మికులకు రావాల్సిన వాటాలో కోత విధిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు కవిత. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం.. సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని కవిత తెలిపారు.







