VGన్యూస్: ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా స్ధాయిలో రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం రెవెన్యూ, విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో కురిసే వర్షాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే స్పందించి సహాయక చర్యలు అందించాలన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.







