VGన్యూస్: అభివృద్ధి అంటే అద్దాల మేడల్లో, రంగుల గోడల్లో కాదు.. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలంటే అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారు చదువుకుంటారన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చలన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని అభిలషించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించగలరన్న ఒక బృహత్తర సంకల్పంతో ఈ పాఠశాలను తీర్చిదిద్దామన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఆరుట్ల పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ కమిటీకి అభినందనలు తెలిపారు. విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తా. విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, అంటరానితనాన్ని, అసమానతలను నిర్మూలించాలని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, విద్యా సంస్కరణలతో ముందుకు వెళ్తూ కేజీ నుంచి పీజీ వరకు అత్యుత్తమ విద్యను అందించాలన్నది తమ సంకల్పం అన్నారు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే విధంగా ఆరుట్ల పాఠశాల తెలంగాణకు ఒక రోల్ మోడల్ గా, స్ఫూర్తిదాయకంగా నిలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి అభిలషించారు.







