VGన్యూస్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉండవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు. ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.







