Home తాజా వార్తలు డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

VGన్యూస్: తెలంగాణలో మాదకద్రవ్యాలకు ఏమాత్రం స్థానం లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ (EAGLE) ఫోర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “సే నో టు డ్రగ్స్” అవగాహన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, విక్రయం, వినియోగం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేస్తున్న పోలీసు శాఖ, ఈగల్ ఫోర్స్ సిబ్బందికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని, “Say No to Drugs” సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.                                        డ్రగ్స్ నిర్మూలనలో చట్టాలు మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు యువతను చైతన్యపరిచే కార్యక్రమాల్లో ముందుండాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పు కలిగించే డ్రగ్స్ మాఫియాపై ఎంతటి కఠిన చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో యువత సైనికుల్లా ముందుండి సమాజాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సి.వి.ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, సినీ నటుడు రామ్ పోతినేని, సినీ నటి మీనాక్షి చౌదరి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.