VGన్యూస్: తెలంగాణలో కమల వికాసానికి, కార్యకర్తల శ్రమకు తిరుగులేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆపార్టీ బూత్ అధ్యక్షులు, బీఎల్ఏల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ.. 1984లో దేశవ్యాప్తంగా బీజేపీకి కేవలం రెండు ఎంపీ స్థానాలు వచ్చినప్పుడు, అందులో ఒక స్థానాన్ని ఇచ్చి ఆదరించిన ఘనత ఈ తెలంగాణ గడ్డదే అని గుర్తు చేశారు. బీజేపీ పరాయి పార్టీ కాదు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు ఇంకా సాకారం కాలేదన్నారు నితిన్ నబీన్. ఆ కలలను నిజం చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులందరూ నిరంతరం శ్రమించాల్సి ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీకి రాజకీయం అంటే కేవలం అధికారం కాదు, అదొక త్యాగం మరియు తపస్సు అని అన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణ గడ్డపై కూడా రెట్టింపు ఉత్సాహంతో పోరాడి విజయం సాధిస్తామని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
Home జాతీయం & అంతర్జాతీయం బీజేపీ పరాయి పార్టీ కాదు.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ: నితిన్ నబీన్










