VGన్యూస్: హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైఫాబాద్ సైన్స్ కళాశాల (Saifabad Science College) ప్రాంగణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి,HMWSSB) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, హార్వెస్టింగ్ బోర్‌వెల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం “ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుందాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో మొక్కలు నాటి, వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యాబోధనతో పాటు వర్షపు నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి వ్యవస్థ నీటిపైనే ఆధారపడి ఉందన్నారు. కురిసే వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా వృథాగా కాలువల్లోకి వెళ్లనివ్వకుండా భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని ప్రతి ఇల్లు, ప్రతి సంస్థలో ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ( Rainwater Harvesting System) లను ఏర్పాటు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










