VGన్యూస్: దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి.. గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని.. కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని వైద్యులు కేసీఆర్ కు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. “మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.







